జక్కన్నపేట్ గ్రామ అభివృద్ధికి అంకితమైన నాయకుడు – చామంతుల సత్యనారాయణ
జక్కన్నపేట్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ప్రజల మన్ననలు పొందుతూ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు చామంతుల సత్యనారాయణ గారు. ఆయన 25-03-1970 న గంగమ్మ – కిష్టయ్య దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటూనే విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
సత్యనారాయణ గారు 10వ తరగతి వరకు సర్దన జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివి, అనంతరం ఇంటర్మీడియట్‌ను మెదక్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు. తర్వాత మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి చదువుతో పాటు సామాజిక సేవ, రాజకీయాలపై ఆసక్తిని పెంపొందించుకున్నారు.
సామాజిక సేవ కార్యక్రమలు – రాజకీయ ప్రవేశం
చిన్నప్పటి నుంచే గ్రామాభివృద్ధి పట్ల మక్కువ కలిగిన సత్యనారాయణ గారు “క్రాంతి యువజన సంఘం”ను స్థాపించి యువతను సమీకరించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామపంచాయతీ కోసం ఉద్యమం నిర్వహించి ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. అప్పట్లో 1994-95 కాలంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలగం ప్రసాద్ రావు గారి సహకారంతో సర్దన నుండి జక్కన్నపేటను వేరు చేసి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంలో సత్యనారాయణ గారు కీలక పాత్ర పోషించారు.
ఆయన సేవలను గుర్తించిన గ్రామ ప్రజలు 1995లో జరిగిన ఎన్నికల్లో జక్కన్నపేట్ తొలి సర్పంచ్‌గా ఎన్నుకొని గౌరవించారు. అనంతరం 2002 నుండి 2013 వరకు ఆయన తల్లి చామంతుల గంగమ్మ గారు వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా గెలిచి ప్రజాసేవ కొనసాగించారు. 2013 నుండి 2018 వరకు ఆయన సతీమణి చామంతుల మాధవి గారు ఎంపీటీసీగా సేవలందించారు.
2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 7 ఓట్ల తేడాతో ఓటమి ఎదురైనా ప్రజల మధ్యే ఉంటూ సేవలను కొనసాగించిన సత్యనారాయణ గారు, 2025 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 109 ఓట్ల భారీ మెజార్టీతో మళ్లీ సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సత్యనారాయణ గారు సర్జన టు జక్కన్నపేట్, సర్జన టు పోచంరాలు ప్రధాన రహదారులను జన్మభూమి కార్యక్రమాల ద్వారా పర్మినెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయించారు. గ్రామంలో 9 వాటర్ ట్యాంకులు, పాఠశాల కాంపౌండ్ వాల్లు, 9 ప్రభుత్వ భవనాలు మంజూరు చేయించి గ్రామానికి మౌలిక సదుపాయాలను అందించారు.
అలాగే సుమారు కోటి రూపాయల వ్యయంతో సర్దనా ఫ్యాక్టరీ నుండి జక్కన్నపేట్ – పోచంరాలు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేశారు. గ్రామంలో దాదాపు 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించారు.
1993లో మత్స్యశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించిన సత్యనారాయణ గారు ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు.
పచ్చని పంట పొలాలు, మహబూబ్‌నగర్ కాలువ అందాలు, ప్రశాంత వాతావరణంతో నిండిన జక్కన్నపేట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సత్యనారాయణ గారు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సేవలందిస్తున్న ఆయన గ్రామ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ప్రజానాయకుడు.